తమను ఆదుకోవాలని సీఎం వైయస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ లకు విజ్ఞప్తి
పులివెందుల పట్టణం లో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్ల విస్తరణకు అధికారులు రంగంలోకి దిగడంతో పులివెందుల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి జగన్ ఎంపీ వైఎస్ అవినాష్ లకువిజ్ఞప్తి చేస్తున్నారు .వివరాల్లోకి వెళితే పులివెందుల పట్టణం లో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. పట్టణంలోని అన్ని రోడ్లను విస్తరించాలని ఈ మేరకు నిర్ణయించారు. పులివెందుల లోని స్థానిక విజయ హోం వద్ద ఉన్న సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు అలాగే ముద్దనూరు మార్కెట్ యార్డ్ వద్ద నుంచిఐజి కార్ల్ భవనాల వరకు ఆరు లైన్ల రోడ్ల నిర్మాణానికి సర్వే ప్రారంభించారు. ఇటీవల పులివెందుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ,పులివెందుల మున్సిపల్ ఇన్చార్జ్ వైఎస్ మనోహర్‌రెడ్డి ,పాడ ఓస్డ్ అనిల్ కుమార్ రెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి లు రోడ్ల విస్తరణ విషయమై వివరించారు. దీంతో ముఖ్యమంత్రి రోడ్ల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే పులివెందుల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించ లేదు. కానీ రోడ్ల విస్తరణ మాత్రం జరగడం విశేషం. ఇదిలా ఉంటే పులివెందుల పట్టణంలోని ప్రధాన రహదారి లు అన్ని మరియు బంగారం అంగల్ల వీధి, రాఘవేంద్ర థియేటర్ నుంచి రింగ్ రోడ్డు వరకు, మారుతి హాల్ రోడ్డు ,ముత్యాల వారి వీధి ,పులివెందుల పూలఅంగళ్ళసర్కిల్, అలాగే శ్రీరామ హాల్ రోడ్డు, ప్రస్తుత బస్టాండ్ నుంచి అంబకపల్లి రోడ్డు తో పాటు పలు రోడ్లను విస్తరించనున్నారు. ఈ రోడ్లు ఎంత మేరకు విస్తరించనున్నారు అన్న విషయమై పట్టణవాసులకు తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. మొత్తానికి పులివెందుల పట్టణం లో రోడ్ల విస్తరణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
ఒకవైపు కరోనా మరొకవైపు వ్యాపారం లేక అల్లాడుతున్న జనం
పులివెందులలో కరోనా వల్ల వ్యాపారాలు లేక ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్న మని ఇటువంటి సమయంలో రోడ్ల విస్తరణ తో తమ కడుపులు కొట్టవద్దని ప్రజలు వేడుకుంటున్నారు .ప్రస్తుతం పట్టణంలో రోడ్ల విస్తరణ చేయవలసిన అవసరం లేదని కొంతమంది వాదిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ శివార్లలో శరవేగంగా పట్టణం అభివృద్ధి చెందుతుందని ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో రోడ్లు విస్తరణ చేయడం వల్ల అభివృద్ధి జరగదని వారు వాపోతున్నారు. ఉన్న కాస్త స్థలాన్ని , భవనాలను కోల్పోతే తమకు ఉపాధి లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. రోడ్ల విస్తరణ వల్ల తమ భవనాలు కోల్పోవడమే కాక ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లు తమకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు .ఏది ఏమైనా రోడ్ల విస్తరణ కార్యక్రమం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఆందోళనకు గురవుతున్నారు అన్న విషయం వాస్తవమే అని పలువురు చెబుతున్నారు. అంతేకాక రోడ్ల విస్తరణ విషయమై ప్రజలకు సమాచారం అందించే వారు కానీ వారి అనుమానాలు తీర్చే వారు కానీ కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
